Saturday, March 28, 2009

Andhra Politics

ఎన్టీఆర్ కోలుకోవడానికి మరిన్ని రోజులు: డాక్టర్లు
హైదరాబాద్, శనివారం, 28 మార్చి 2009
సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా కోలుకోవడానికి మరిన్ని రోజుల సమయం పడుతుందని కిమ్స్ వైద్యులు ప్రకటించారు. దాదాపు నాలుగువారాలు తర్వాతే ఆయన పూర్తిగా కోలుకోగలరని, అయితే ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉందని వారు పేర్కొన్నారు.

ఈ విషయమై కిమ్స్ డైరెక్టర్ భాస్కర్ మాట్లాడుతూ ఎన్టీఆర్‌ వెన్నుపూసకు తగిలిన గాయం కారణంగా ఆయన నడవడానికి, కూర్చోవడానికి కొన్ని రోజులు పడుతుందని తెలిపారు. అయితే ప్రస్తుతం ఆయన వేగంగా కోలుకుంటున్నారని, గతరాత్రినుంచి ఆహారం కూడా తీసుకుంటున్నారని వివరించారు.

తెలుగుదేశం పార్టీ తరపున రాష్ట్రంలో మొదటి విడత ప్రచార కార్యక్రమాలు ముగించుకొని తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరిన సందర్భంగా గురువారం రాత్రి జూనియర్ ఎన్టీఆర్‌ రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయన తలకు, కంటికి గాయాలయ్యాయి. గురువారం రాత్రి 11 గంటల సమయంలో నల్గొండ జిల్లా మోతె మండలం పోలీస్ స్టేషన్ సమీపంలో ఎన్టీఆర్ కాన్వాయ్ ప్రమాదానికి గురికావడంతో ఆయనకు ఓ మోస్తరుగా గాయాలయ్యాయి.

ఓ మలుపు వద్ద ఎన్టీఆర్ కారు పల్టీ కొట్టడంతో ప్రమాదం జరిగినట్టు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఖమ్మం జిల్లా నుంచి హైదరాబాద్ తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎన్టీఆర్‌తోపాటు కారులో ఉన్న నటుడు రాజీవ్ కనకాలకు కూడా ఈ సందర్భంగా గాయాలయ్యాయి. ఘటన తర్వాత వారిని వెంటనే సూర్యాపేటలోని న్యూలైఫ్ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేశారు. అటుపై ఎన్టీఆర్, రాజీవ్ కనకాలను హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

No comments:

Post a Comment