Saturday, March 28, 2009

రెండో జాబితాలో మహిళలకు స్థానం: చిరు

తమ పార్టీ తరపున వెలువడే రెండో జాబితాలో మహిళలకు ప్రాధాన్యం ఇస్తామని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి పేర్కొన్నారు. తాము మొదటినుంచి చెప్పినట్టుగానే తొలి జాబితా సందర్భంగా సామాజికన్యాయాన్ని పాటించామని ఆయన తెలిపారు.

ఈ విషయమై శనివారం కాకినాడలో చిరంజీవి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు. అలాగే తాము అధికారంలోకి రాగానే రూ. 100కే వంటసరకు పథకంపైనే తొలి సంతకం పెడతామని స్పష్టం చేశారు. అలాగే ఆయన మాట్లాడుతూ పార్టీ తరపున టికెట్లు దక్కనివారిలో అసంతృప్తి సహజమేనని అన్నారు.

అయితే పార్టీలో ఉన్నవారందరికీ టికెట్లు ఇవ్వడం కుదరదని, ఈ విషయాన్ని గుర్తించి కష్టించి పనిచేస్తే భవిష్యత్‌లో తప్పక అవకాశాలు ఇస్తామని ఆయన పేర్కొన్నారు.

టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల

రానున్న ఎన్నికల్లో పార్టీ తరపున బరిలో నిలవనున్న అభ్యర్ధులకు సంబంధించిన మూడో జాబితాను తెలుగుదేశం పార్టీ శనివారం విడుదల చేసింది. ఈ జాబితాలో బాగంగా లోక్‌సభకు పోటీ చేస్తున్న 22మందిని, అసెంబ్లీకి పోటీచేస్తున్న 55మందిని పార్టీ ప్రకటించింది.

ఈ జాబితాలోని వివరాల ప్రకారం టీడీపీ పార్లమెంటరీ నేత, మాజీ కేంద్ర మంత్రి కె ఎర్రన్నాయుడు శ్రీకాకుళం నుంచే మళ్లీ పోటీ చేస్తుండగా, ఉర్ధూ డైలీ పత్రిక సియాసత్ ఎడిటర్ అయిన జాహెద్ ఆలీ ఖాన్‌ హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. అలాగే విశాఖపట్నం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందరేశ్వరిపై టీడీపీ తరపున మాజీ ఎంపి ఎంవీవీఎస్ మూర్తి పోటీ చేయనున్నారు.

వీరితోపాటు మాజీ రాష్ట్ర మంత్రి ఎన్ మొహ్మద్ ఫరూఖ్ నంద్యాల నుంచి, మరో మాజీ మంత్రి మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) ఎలూరు నుంచి పోటీ చేస్తారు. బాబు ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలగి టీడీపీ గూటికి చేరిన సంగతి తెలిసిందే. అలాగే మాజీ మంత్రి, నటుడు ఎన్ శివ ప్రసాద్ చిత్తూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తారు.

ఇక ప్రజారాజ్యం నుంచి వైదొలగి ఇటీవలే టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఎన్ఆర్ఐ వాసంశెట్టి సత్య కాకినాడ నుంచి పోటీ చేయనున్నారు. టీడీపీ ప్రకటించిన ఈ తాజా జాబితాలో అనేక మంది మాజీ మంత్రులకు మళ్లీ స్థానం లభించడం విశేషం.

Andhra Politics

ఎన్టీఆర్ కోలుకోవడానికి మరిన్ని రోజులు: డాక్టర్లు
హైదరాబాద్, శనివారం, 28 మార్చి 2009
సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా కోలుకోవడానికి మరిన్ని రోజుల సమయం పడుతుందని కిమ్స్ వైద్యులు ప్రకటించారు. దాదాపు నాలుగువారాలు తర్వాతే ఆయన పూర్తిగా కోలుకోగలరని, అయితే ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉందని వారు పేర్కొన్నారు.

ఈ విషయమై కిమ్స్ డైరెక్టర్ భాస్కర్ మాట్లాడుతూ ఎన్టీఆర్‌ వెన్నుపూసకు తగిలిన గాయం కారణంగా ఆయన నడవడానికి, కూర్చోవడానికి కొన్ని రోజులు పడుతుందని తెలిపారు. అయితే ప్రస్తుతం ఆయన వేగంగా కోలుకుంటున్నారని, గతరాత్రినుంచి ఆహారం కూడా తీసుకుంటున్నారని వివరించారు.

తెలుగుదేశం పార్టీ తరపున రాష్ట్రంలో మొదటి విడత ప్రచార కార్యక్రమాలు ముగించుకొని తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరిన సందర్భంగా గురువారం రాత్రి జూనియర్ ఎన్టీఆర్‌ రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయన తలకు, కంటికి గాయాలయ్యాయి. గురువారం రాత్రి 11 గంటల సమయంలో నల్గొండ జిల్లా మోతె మండలం పోలీస్ స్టేషన్ సమీపంలో ఎన్టీఆర్ కాన్వాయ్ ప్రమాదానికి గురికావడంతో ఆయనకు ఓ మోస్తరుగా గాయాలయ్యాయి.

ఓ మలుపు వద్ద ఎన్టీఆర్ కారు పల్టీ కొట్టడంతో ప్రమాదం జరిగినట్టు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఖమ్మం జిల్లా నుంచి హైదరాబాద్ తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎన్టీఆర్‌తోపాటు కారులో ఉన్న నటుడు రాజీవ్ కనకాలకు కూడా ఈ సందర్భంగా గాయాలయ్యాయి. ఘటన తర్వాత వారిని వెంటనే సూర్యాపేటలోని న్యూలైఫ్ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేశారు. అటుపై ఎన్టీఆర్, రాజీవ్ కనకాలను హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు.